యువ నేతకు పట్టం కట్టేనా ? జన నేత హస్తిన బాట పట్టేనా ?
ఉగాది తర్వాత రెడ్యానాయక్ చెప్పింది నిజం కానుందా ?
తెలంగాణ రాష్ట్రంలో 2021 ఏడాది లో ఏం మార్పులు జరగ బోతున్నాయి? ఏవైనా అద్భుతాలు జరుగుతాయా ? యువరాజు కెటిఆర్ పట్టాభి షిక్తుడు కానున్నారా ?
కెటిఆర్ సిఎం కావడం అంత ఈజీ కాదా ? కెసిఆర్ కాశాయ కూటమికి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశమంతా ఒక్కటి చేస్తారా? కెటిఆర్ ఎంత వరకు సిఎం పదవికి అర్హుడు ? బిజెపిని తట్టుకుని ఆయన నెగ్గుకు రాగలడా? ఈ ప్రశ్నలకు కొత్త ఏడాదిలో సమాధానాలు లభిస్తాయా ?
చాలా కాలంగా చర్చల్లో నానుతున్న ముచ్చట ఏంటంటే యువరాజు పట్టాభిషేకం. అదే సిఎం కెసిఆర్ తన కుర్చీలో కొడుకును కూర్చోబెట్టి ఆయన ఢిల్లీలో మరో పెద్ద కుర్చీలో కూర్చుని బిజెపికి అనుకూలంగానో లేదా వ్యతి రేకంగానో దేశ మంతా ఒక్కటి చేస్తాడని..... కెటిఆర్ సిఎం అవుతాడన్న ముచ్చట పాతదే అయినా మాజి మంత్రి సీనియర్ నేత డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ నోటి నుండి తాజాగా వెలువడడంతో మరో సారి ముచ్చట అయింది.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే..కదా ! అటు పొద్దు ఇటు ఇటు పొద్దు అటు పొడిచినట్లుగా అద్భుత సన్ని వేశాలు అనేకం రాజకీయాల్లోనే చూస్తాం.
దుబ్బాక ఎన్నికల ఫలితాల అనంతరం జిహెచ్ఎంసి లో టిఆర్ఎస్ మాజిక్ ఫిగర్ గీత దాట లేక సడ్డమాలిన సమయంలో కెటిఆర్ సిఎం అవుతాడన్న మాట కొంత వరకు విచిత్రంగానే అనిపించవచ్చు. ఎందుకంటే ఒకప్పటి తెలంగాణ ఉద్యమ అధినేత ప్రస్తుత సిఎం కెసిఆర్ పొలిటికల్ గ్రాఫ్ అమాంతం కాక పోయినా కొంచెం కొంచెంగా పడి పోతున్న సంధర్భంలో .యువ నేత కెటిఆర్ ముఖ్యమంత్రిగా ఆరంగేట్రం చేసి పరిస్తితులు చక్కదిద్దుతారా ?
జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందు కాశాయ కూటమిపై కారాలు మిర్యాలు నూరిన కెసిఆర్ హస్తినకు వెళ్లి ఏం చేసాడో అందరూ చూశారు కదా ? వినయ విధేయ చంద్రశేఖరా!అనిపించుకున్నాడు కదా !
దేశంలో బిజెపికి వ్యతిరేకంగా ఫ్రంట్ లేదు.. బ్యాకు.. లేదు అన్నట్లుగా ఆయన హస్తిన నుండి తిరిగి వచ్చిన తర్వాత చడి చప్పుడు లేకుండా ఏం చేస్తున్నాడు ?
ఫాం హవుజ్ లో ఫెడరల్ ఫ్రంట్ కోసం వ్యూహ రచనలో ఉన్నారా ? కేెంద్రం పై ఇక యుద్ధమంటూ ప్రకటించిన తర్వాత ఎక్కు పెట్టిన కత్తిని ఏం చేశాడనే ప్రశ్నలు రాజకీయ పరంగా ముచ్చట్లు గా మారాయి.
ఢిల్లీలో పార్టి కార్యాలయం కోసం స్థలం లభించినంత మాత్రాన అడ్డా దొరికి నట్లే నని జెండా పాతేయడం ముచ్చట్లు చెప్పుకున్నంత ఈజి కాదు. పైగా కెసిఆర్ కష్టాలు కెసిఆర్ కు ఉన్నాయి.
జిహెచ్ఎంసి ఎన్నికల ముందు కనిపించిన కెసిఆర్ వేరు. ఎన్నికల ఫలితాల అనంతరం కనిపిస్తున్న కెసిఆర్ వేరు.
ఏదో ఎన్నికల్లో క్యాడర్ ను ఉత్సాహ పరిచేందుకు వంద బొంకాల్సి ఉంటది. చాలెంజ్ లు విసరాల్సి వస్తది. చాలెంజ్ ల పై ఎంత వరకు నిలబడడ మనేది ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాలపై ఉంటది. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ తొడ కొడితే మెడ కోసుకున్నంత పని చేసారు తెలంగాణ ప్రజలు, సకల జనులు ఒక్కటై సింహ నాదం చేసారు. ఆ సింహ నాధమే కెసిఆర్ ను ఆకాశం అంత ఎత్తున .నిల బెట్టింది. తెలంగాణ పోరాటం యావత్తు మహాద్బుత దృశ్య కావ్యం.
నభూతో నభవిష్యత్.
మంత్రి వర్గానికి పనికి రాడని ఆంధ్ర నేతలు పక్కన పెట్టిన కెసిఆర్ ను బాహుబలిని చేసేందుకు తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. ఎన్నో ఆశలతో కెసిఆర్ ను గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు. కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూసి చూసి కళ్ళ ుకాయలు కాసి ఆరేడేండ్లు గడిచి పోయాయి కాని ఏ ఆశలు నెర వేర లేదు. తమ జీవితం సంక నాకింది కాని తమ పిల్లలకు ఉద్యోగాలు దక్కితే చాలనుకున్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఏ ఉపాధి లేకుండా గడ్డాలు పెంచుకుని తిరుగుతున్నారు. టిఆర్ఎస్ పార్టి శ్రేణులు అయితే బయటికి చెప్పుకో లేని మానసిక వేదన అనుభవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంతో తమ కుటుంబాలను నష్ట పరుచుకుని తన్నులు తిని జెండాలు మోస్తే చివరికి తమకు పదవులు దక్కకుండా తెలంగాణ ద్రోహులకు కట్టబెట్టారని కన్నీళ్ళ పర్యంతం అవుతున్నారు.
"ఎవరికి చెప్పుకోవాలి మా భాదలు... కష్టాలంటూ..... గా మంత్రా ఉద్యమం సమయంలో గూండాలతో కొట్టించిన మంత్రా ఆయన దగ్గరి కెళ్లి చెప్పు కోవాల్నా" అంటూ ఆవేశ పడి పోతున్నారు.
(వరంగల్ జిల్లాలో సిఎం సామాజిక వర్గానికే చెందిన మంత్రిగా ఉన్న ఓ నేత తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు ను వెంటేసుకుని పాలకుర్తికి తీసుకు వచ్చి గూండాలతో కాకతీయ యూనివర్శిటి విద్యార్థులను కొట్టించాడు. ఆయన చేపట్టిన బస్సు యాత్రను జై తెలంగాణ అంటూ అడ్డగించిన విద్యార్థులను హన్మకొండ చౌరస్తాలో అందరూ చూస్తుండగా బూటు కాళ్ళతో తన్నించి ఈ డ్చి పడేయించారు. ) ఇాలాంటి మరిచి పోలేని ఘటనలు అనేకం ఉద్య కారుల మదిలో ఉన్నాయి. ఉద్యమ కాలం అంతా రోడ్డుపైనే వారి జీవితం సాగింది. పోలీస్ స్టేషన్లు జైళ్ళే జీవితంగా గడిపారు. విద్యార్థులకు అర్ద రాత్రి అపరాత్రి అని లేకుండా పోలీస్టేషన్లు కోర్టుల చుట్టూ తిరిగి బేళ్ళు ఇప్పించిన అధ్యాపకుడు ప్రొఫెసర్ సీతారాం నాయక్ కు రెండో దఫా ఏ పదవి లేకుండా చేసారు. ఉద్యమంతో సంభందం లేని వాళ్లంతా ప్రోటో కాల్ తో కాన్వాయ్ లో పోతుంటే తెలంగాణ కోసం కొట్లాడిన వారంతా పనికి రాని వాళ్ళమయ్యామని ఏం చేయలేని నిస్సహాయ స్థితి వారిది. ఎవరైనా పాత ఉద్యమ కారులు కనిపిస్తే ఒకరి కొకరు భాదలు వెల్ల గక్కుకుంటున్నారు.
ఇక 1969 ఉద్యమ కారులకు వారి కుటుంబాలను తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఆదుకున్నది లేదు తొలి దశ ఉద్యమ కారుల కుటుంబాలు అట్లాగే మలి తుది దశ ఉద్యమ కారుల కుటుంబాలు దిక్కు దివానం లేక తెలంగాణ లో అవస్థల పాలయ్యాయి.
ఇవేవి పట్టించు కోని టిఆర్ఎస్ అగ్ర నాయకత్వం తాము తమ కుటుంబం తమ భందువర్గం అంటూ పదవులన్ని వారికే ఫల హారం చేసి పంచి పెట్టి ఎవరిని పట్టించు కోక పోవడం ఉద్యమ కారులను పక్కనపెట్టి ఉద్యమ ద్రోహులకు పదవులు ఇవ్వడం వల్ల కెసిఆర్ గ్రాఫ్ పడి పోయింది. ఈ విషయం దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల అనంతరం స్పష్టం అయింది.
అసలు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమిటో ఒక్క సారి కూడ నాయకత్వం సింహావ లోకనం చేసుకున్న పాపాన పోలేదు. అధికారం ఉంటే చాలను కుని అధికారం చూసే తమ వెంట వస్తారని పవర్ పాలిటిక్స్ కు పరిమితం అయ్యారు.
ఇవన్ని బిజెపికి కల్సివచ్చే ఆంశాలుగా మారాయి. బిజెపి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మూడు ఎంపి సీట్ల తో మొదలై దుబ్బాక ఉప ఎన్నికలు జిహెచ్ఎంసి ఎన్నికల వరకు టిఆర్ఆస్ కు ప్రత్యామ్నాయంగా నిలిచింది.
కెసిఆర్ చేసిన పెద్ద పొరపా టేంటంటే పోలీసు వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చి సభలు సమావేశాలు పెట్టుకుని నిరసన తెలిపే కనీస హక్కులు కాలరాయడం. నిరసన తెలిపే హక్కు లేకండా చేస్తే తెలంగాణ జనం కొర్టు కెళ్ళి ధర్నాచౌక్ సాధించారు. రాజకీయ పార్టీలలో మిగతా వాటి కన్నా బిజెపి వీటిని మొండిగా ఎదిరించి సక్సెస్ అయింది. ఇక ఏ ఎన్నిక లైనా ఎదుర్కునే సత్తా రాష్ట్రంలో ఒక్క బిజెపికే ఉందంటూ ఆ పార్టి అధికారమే లక్ష్యంగా దూకుడు పెంచింది.
కెసిఆర్ ఇంటి పరిస్థితులు ఇట్లా ఉంటే ఇక బయట పరిస్థితులు కూడ ఆయనకు అంతగా అనుకూలంగా లేవు. ఎపిలో జగన్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన భుజంపై చేయి వేసి అన్న తమ్ముల్లా కల్సి ఉందామని కెసిఆర్ ఆభయ హస్తం అందించినా జగన్ తొందర లోనే కెసిఆర్ చేయిని వదిలించుకున్నాడు. కెసిఆర్ తో జమిలి ప్రయాణం ప్రమాద కరమని గుర్తించి ఆయన జాతీయ రాజకీయాల్లో తనకు నచ్చిన రీతిలో ఒంటరి పాత్ర పోషిస్తున్నాడు.
స్థిమితం లేని విధానాలతో కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో తన కంటూ ఓ ప్రత్యేక మైన రోల్ లేకుండా చేసుకున్నారు. ఆయనను నమ్మి బిజెపికి వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టే ఆలోచనలు చేసేందుకు ఎవరూ ఆసక్తిగా లేరు.
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జి బిజెపితో నేరుగా పోరాడుతున్న రీతిలో కెసిఆర్ పోరాడే పరిస్థితి లేదు.
ఈ పరిస్థితిలో కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం కొడుక్కి అప్పగించి ఢిల్లీలో పీట వేసుకుని జాతీయ రాజకీయాలంటు మొదలు పెడితే రాష్ట్రం లో ఇప్పటికే అధ్వాన్నంగా ఉన్న పరిస్థితులు మరింత కుప్ప కూలడం తప్పితే ఏం ఉండదనే భావన పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది. ముందు కెసిఆర్ తన ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేయాలి. కెటి ఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ముచ్చట పడి పోతే తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా తారు మారు అయి పోవడం ఖాయం. ఉద్యమ చరిత్రలో తెచ్చుకున్న పేరును చేజేతులా చెరిపి వేసుకునే విదంగా కెసిఆర్ ఉంటే కనుక ఎవరూ ఎమి చేయలేరు. ఏ నేత అయినా ప్రజా బలం లేకుండా ఒంటరిగా ఏమి సాధించ లేరు.
ఇక కెటిఆర్ గురించి ఆయన అర్హతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మంచి విద్యాధికుడు.తండ్రిని మించిన మాట కారి. ఘటనా ఘటన సమర్దుడు కాని ఎందుకో ఆయన పట్ల ప్రజలు సంపూర్ణ అంగీకారంతో ఉన్నట్లు కనిపించడంలేదు. ఆ విషయం కెటిఆర్ సారద్యం వహించిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో తేలిపోయింది. టిఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎనని ఉన్నా నాయకున్ని నచ్చితే జనం అన్ని మరిచి పోయి ఓటేస్తారు. కాని కెటిఆర్ విషయంలో అలా జరగ లేదంటే ఆయనకు కామన్ పబ్లిక్ లో అంతగా ఇష్టత లేదని విషయం అర్దం అవుతుంది.
కేవలం పవర్ పాలిటిక్స్ కోరుకునే వారు వాటినే మెచ్చుకునేవారు తప్ప ఇతరత్రా జనం ఎవరూ కెటిఆర్ ను కెసిఆర్ అనంతర వారసుడిగా సిఎం కుర్చీలో చూడాలను కోవడం లేదు.
గతంలో ఇలాంటి పొలిటికల్ గాసిప్స్ గురించి ప్రస్తావిస్తూ సిఎం కెసిఆరే స్వయంగా శాసన సభలో స్పందించి నవ్వులు పూయించారు. కొడుకును కాని అల్లున్ని కాని ముఖ్యమంత్రిని చేయబోనంటూ మరో 10 ఏండ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ ప్రకటించారు.
ఓ టిఆర్ఎస్ నాయకుడే ఓ సారి కెటిఆర్ గురించి తనకు సన్నిహితులైన మీడియా వారితో మాటా ముచ్చట సమయంలో కెటిఆర్ కు ఎందుకో కాని కెసిఆర్ లెక్క ప్రజలలో అంతగా ఆదరణ లేదని అన్నారు. పవర్ లో ఉన్నాడు కనుక నడుస్తోందని కెసిఆర్ ఉద్యమ నేత కనుక ఆయన కి తెలంగాణ ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారని కాని కెటిఆర్ విషయంలో ప్రజలు ఆయనను కెసిఆర్ స్థాయిలో చూడ లేక పోతున్నారని అన్నారు.
కెటిఆర్ ఒక వేళ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఊహించని రాజకీయ పరిణామాలు జరగడం ఖాయం. కెటిఆర్ కనుక సిఎం అయితే ఇక బిజెపీకి రాష్ట్రంలో పచ్చ తోరణాలు కట్టి ఎర్ర కార్పెట్ పరిచినట్లే నని భావించవచ్చు. ఘన చరిత్ర కలిగిన ఉద్యమ పార్టి తెలంగాణ రాష్ట్ర సమితి ఓ కుటంబ పార్టీగా మిగిలి అస్తిత్వాన్ని కోల్పోతుందా లేక ఉద్యమ పార్టీగా చరిత్రలో మిగిలి పోతుందా అనేది కెటిఆర్ కిస్సా కుర్సీతో ముడి పడి ఉంది.
కెసిఆర్ ఇప్పటికైనా తననీ స్థాయికి చేర్చిన తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవాలంటే కుటుంబ రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ ప్రజలే కుటుంబంగా వారి బాగు కోసం పాటు పడాలి. ఉద్యమ వీరులను పార్టీలకు అతీతంగ గుర్తించాలి. తెలంగాణ ఉద్యమ కారులకు పూర్తిగా పార్టీని అంకితం చేయాలి. తెలంగాణ జనం కోసం ఆయన ఆయన కోసం తెలంగాణ జనం తపించాలి. కుటుంబ సబ్యుల కోసం అయితే కుటుంబంలో ఒక్కడిగా మిగిలి పోతాడు. తెలంగాణ కోసం అయితే తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచి పోతాడు. తెలంగాణ జనం నాడిని పసి గట్ట గలిగిన నేతగా ప్రజల ఆకాంక్షలు నెర వేర్చి జన నేతగా నిలిస్తే జాతీయ రాజ కీయాలే కాదు అంతర్జాతీయ రాజకీయాలను కూడ శాసించ వచ్చు.
నూటికి నూరు శాతం అట్లా జరగాలని...ఆ దిశగా కెసిఆర్ అడుగులు పడాలని ఆశిద్దాం...
0 వ్యాఖ్యలు