About Me

ట్రంప్ ను మిలిటరీ సహాయంతో వైట్‌హౌజ్‌ నుంచి పంపేస్తాం... డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌

వాషింగ్టన్‌: ఎన్నికల్లో గెలవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అధ్యక్ష పదవికి పోటీ పడనున్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ అన్నారు. ఒకవేళ ట్రంప్‌ ఓడిపోయినప్పటికీ.. ఓటమిని అంగీకరించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తే.. సైన్యం మర్యాదపూర్వకంగా ఆయనను శ్వేతసౌధం వెలుపలికి పంపిస్తుందని విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా డెమొక్రటిక్‌ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వానికి జరిగే పోటీ నుంచి బెర్నీ సాండర్స్‌ తప్పుకొంటున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో జో బిడెన్‌ అభ్యర్థిత్వం ఖరారైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్‌ విధానాలను విమర్శిస్తూ.. ఆయన పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ జో బిడెన్‌ ప్రచార దూకుడు పెంచారు.
కామెడీ సెంట్రల్‌ ది డెయిలీ షోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేను ఆందోళన చెందే ఏకైక అంశం ఏమిటంటే.. ఈ ఎన్నికల్లో విజయం సొంతం చేసుకోవడానికి ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ఏం చేయబోతున్నారో తెలియదు. మెయిల్‌ -ఇన్‌ ఓటింగ్‌(మెయిల్‌ ద్వారా ఓటేయడం)ను ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే రిపబ్లికన్ల ప్రయత్నాలు అడ్డుకునేందుకు.. దేశ వ్యాప్తంగా అన్ని ఎన్నికల కేంద్రాల వద్ద డెమొక్రాట్స్‌ లాయర్లను పెట్టకునే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా 2016 ఎన్నికల ప్రచారం ఫైనల్‌ డిబేట్‌లో మాట్లాడుతూ.. ఆనాటి డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ విజయం సాధిస్తే.. ఆ గెలుపును తాను అంగీకరించబోనని ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని ఉటంకిస్తూ.. ప్రస్తుతం ట్రంప్‌ ఇలాగే వ్యవహరిస్తే మిలిటరీ సహాయంతో ఆయనను వైట్‌హౌజ్‌ నుంచి పంపేస్తామని జో బిడెన్‌ వ్యాఖ్యానించారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యోదంతాన్ని నిరసిస్తూ జరుగుతున్న ఉద్యమాలను అణచివేయడంలో రాష్ట్రాలు విఫలమైతే సైన్యాన్ని రంగంలోకి దింపేందుకూ వెనుకాడనన్న ట్రంప్‌ వ్యాఖ్యలకు ఈ విధంగా కౌంటర్‌ ఇచ్చారు. ఇక జో బిడెన్‌ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్‌ రీ- ఎలక్షన్‌ క్యాంపెయిన్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ టిమ్‌ ముర్తా.. ‘‘2020 ఎన్నికల ఫలితాన్ని తాను తప్పకుండా అంగీకరిస్తానని ట్రంప్‌ ఇదివరకే స్పష్టం చేశారు. అయినప్పటికీ జో బిడెన్‌ ఇలాంటి వ్యాఖ్యల ద్వారా మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని మండిపడ్డారు. మెదడులేని వాళ్లే ఇలాంటి కుట్రలు చేస్తారని విమర్శించారు. ఇదిలా ఉండగా.. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు జో బిడెన్‌కు చైనా సాయం చేసే అవకాశం ఉందంటూ ట్రంప్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments