About Me

తస్లీమా మహమ్మద్ సబ్ రిజిస్ట్రార్ !

shared  From Yousuf Shaik face book wall

ఎవరూ పట్టించుకోని అభాగ్యుల ముందు ప్రత్యక్షమయ్యే దైవం!
ఈ మధ్య లాక్ డౌన్ లో ఎమ్మెల్యే సీతక్కతో మూటలెత్తుకొని అడవుల్లోకి నడుస్తూ కనిపించిన సెల్వార్ కమీజ్ స్త్రీమూర్తి!
అదిగో అప్పుడు ఎవరా ఈ తస్లీమా అని వెతుకులాడామ్.. చూస్తే భోలీ భాలీసీ, ధైర్యమ్ పట్టుదల కలగలిసిన ఒక మాతృ హృదయ తస్లీమా సాక్షాత్కరించింది!
ఆమె అధికారిగా హాయైన జిందెగీ గడపొచ్చు.. కానీ ఆమెను ఎక్కడ వెతికినా ఎవరికో సాయం చేస్తూనో ఎవరికో నీళ్లు తాపిస్తూనో అన్నం తినిపిస్తూనో పేద పసి పిల్లల్ని చూడగానే వళ్ళోకి తీసేసుకొని లోకాన్ని మరచిపోతూనో కనిపిస్తుంది!
తస్లీమా కు facebook ఐడీ కూడా లేదు! కానీ తస్లీమా సబ్ రిజిస్ట్రార్ ఫాలోవర్స్ గ్రూప్, పేజీ మాత్రం ఉన్నాయి! అది ఆమెను అభిమానించేవారే నడుపుతుంటారు.
వరంగల్ జిల్లా ములుగు మండల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా! వరంగల్ కు ములుగు 45 kms. ఆమె ఊరు రామచంద్రాపురం ములుగు నుంచి 12 kms. తన మండలానికే సబ్ రిజిస్ట్రార్ గా పని చేస్తుండడం ఆమె కార్యదక్షతకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. దాంతో తన సొంత ప్రజలకు సేవ చేస్తున్న భావనతో ఆమె మరిన్ని మంచి పనులు చేస్తున్నారు.
తండ్రి సర్వర్ ఎమ్ సీపీఐ నాయకుడు. ములుగు టైగర్ అని ఆయనకు పేరు. తస్లీమా రెండేళ్ల వయసులో హత్యకు గురయ్యాడు. భర్తను కోల్పోయిన తల్లికి తాము ఐదుగురు పిల్లలు! నాలుగో సంతానం తస్లీమా. తల్లి వ్యవసాయం చేస్తూ పిల్లల్ని సాకింది. నాలుగో తరగతిలోనే తస్లీమాను కాజీపేట హాస్టల్లో వేసేశారు.
హన్మకొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఎంపీసీ చేశారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశారు. గ్రూప్స్ రాయాలంటే కోచింగ్ కు పైసల్లేవు..
ఊరి నుంచి వచ్చిన అమ్మ తన వ్యవసాయ కష్టార్జితం 13 వేల రూపాయలు తెచ్చి కాలేజీలో తన కళ్ళ ముందు కడుతుంటే చూస్తూ తల్లడిల్లిపోయింది తస్లీమా!
తరువాత కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీకి పొద్దున 8 గంటలకు వెళ్లి రాత్రి ఎనిమిది వరకు చదువుతూ నోట్స్ రాసుకునేది. ఆ లైబ్రరీయే తన జీవితాన్ని మలుపు తిప్పిందని ఆమె చెప్తుంటుంది! అమ్మంటే ప్రాణం.. వ్యవసాయం అంటే ఇష్టం తస్లీమాకు!
గ్రూప్స్ రాసేరోజు బోర్డు మీద హాల్ టికెట్ నంబర్ కనిపించక టెన్షన్! అరగంట లేటయిపోయింది. కానీ రిజల్ట్ రోజు పేపర్ లో ఆమె నంబర్ కనిపించింది. ఆమె ఆనందానికి అవధుల్లేవు! ఏ పని చేసే ముందయినా కళ్ళు మూసుకొని తన తల్లిని తలుచుకుంటుంది తస్లీమా! ఈ మాట ఆమె చెప్తుంటే మన కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతాయి! తన గురించి చెప్పమంటే ఉద్వేగానికి గురికాకుండా, దుఃఖంలో తడవకుండా, తల్లిని తలుచుకోకుండా మాట్లాడలేదు తస్లీమా! ఆమె మాట్లాడిన ఒక వీడియో చూస్తూ నేనేడ్చేశాను! (ఆ వీడియో లింక్ కింద ఇస్తున్నాను)
అలాంటి తస్లీమా మొన్న లాక్ డౌన్ కాలంలో తన మండలంలోని రోడ్డు మార్గం లేని గుత్తి కోయిల గూడేలకు ఎమ్మెల్యే సీతక్కతో పాటు, తన సిబ్బందితో కలిసి మూటలెత్తుకొని నడవడం చూశామ్! ఎండల్లో చెమటలు కారంగా నడుస్తూ చెట్ల కింద కూర్చొని ఆకుల్లో అన్నం తినడం, కోయలతో కూర్చొని తినడం, వారికి సాయం చేయడం చూశామ్!
ఇట్లా ఈ లాక్ డౌన్ కాలంలో ఎందరికో సాయం చేయడమే కాకుండా కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు చెప్పడం చేశారు తస్లీమా!
ఛత్తీస్ గడ్ బయలుదేరిన ఐదు కుటుంబాల వలసకూలీలు దారితప్పి ములుగు చేరుకుంటే వారికి అన్నం వడ్డించి పెట్టి వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు.
ఎందరో కూలీలకు
బియ్యం, నిత్యావసర వస్తువులు అందించడం, నీళ్లు సరఫరా చేయడం చేశారు.
తండ్రులను కోల్పోయిన పిల్లల్ని చూస్తే తల్లడిల్లిపోతుంది తస్లీమా! ఆమె ఫోటోల కోసం వెతికితే పసిపిల్లల్ని ఎత్తుకొని తన్మయంతో కనిపించే ఫోటోలే ఎక్కువ కనిపిస్తాయి. ఐదుగురు పిల్లలున్న ఒక రాజస్తానీ చనిపోతే ఆ కుటుంబాన్ని దత్తతకు తీసుకున్నారు తస్లీమా! వారికి అన్నీ తానే! వారికి తగిన కార్డులు, ఒక ప్లాట్ ఇప్పించారు. వారి హిందూ పండుగల్ని వారితో కలిసి సెలబ్రేట్ చేస్తారు.
11 ఏళ్ల నుంచి కొండగట్లలో నివసించే గుత్తికోయల గూడేలకు తిరుగుతూనే ఉన్నారు తస్లీమా! గుత్తికోయల పెద్దక్క అని పేరు తెచ్చుకున్నారు. ఈ లాక్ డౌన్ కాలంలో 15 రోజులకు సరిపడా బియ్యం, నిత్యావసరాలు వారికి అందజేశారు.
తస్లీమా గురించి పత్రికల విమెన్ పేజెస్ లో చాలా ఆర్టికల్సే వచ్చాయి! కాకపోతే అర్హత లేనివారి గురించి కూడా పేజెడు బొమ్మలేసి రాసీ రాసీ ఆ పేజీలు సాధికారతను కోల్పోయాయి. అందుకే బహుశా ఆ రాతలు ఎవరూ పట్టించుకున్నట్టు లేరు. కాకపోతే ములుగు మండలంలో తస్లీమా అంటే అన్ని వర్గాల వారికి ఎంతో గౌరవం ఉంది! అభిమానులు ఎంతోమంది ఉన్నారు.
అనాధలకు, దివ్యాoగులకు
మతిస్థిమితం లేనివారికి, ఏ ఆసరా లేక చెట్ల కింద ఉండేవారికి ఇలా అందరికీ సహారా తస్లీమా!
తస్లీమా తన తండ్రి పేర సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లల్ని చేర్చమని కౌన్సిలింగ్ ఇస్తుంటారు. తన మండలంలోని మజీదుల ఇమామ్ లకు కూడా ముస్లిం రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లల్ని చేర్చమని చెప్పాలని సూచించారు.
'పే బ్యాక్ టు ద సొసైటీ' కాన్సెప్ట్ తెలిసిన హృదయం! పిల్లలకు ఇన్స్ పైరింగ్ స్పీచ్ లు ఇవ్వడంలో ఆసక్తి! ఏదేని కష్టం వస్తే ఈ అక్కకు కాల్ చేయమని నంబర్ ఇచ్చే పెద్ద మనసు తస్లీమా సొంతం!
ఇలా ఎంత చెప్పినా తక్కువే తస్లీమా గురించి! అన్నేసి పనులు చేసి ఉన్నారు.. చేస్తూనే ఉన్నారు!
ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్న ఈ తల్లి కాస్త ముస్లిం ఆడపిల్లల బాగోగులపై, చదువుపై, చైతన్యంపై దృష్టి పెట్టాలని కోరుతూ...
ఈ భూమి పుత్రికకు.. ఈ తెలుగు బేటీ కి.. తెలంగాణ బిడ్డకు.. ఎవరూ పట్టించుకోని వారిని ఆదరించడానికి తండ్లాడే ఈ తల్లికి వేల వేల సలాములు! మనఃపూర్వక అభినందనలు!

Post a Comment

0 Comments