About Me

సంభాషణ.....జర్నలిస్టు తో జర్నలిస్టు

** సంభాషణ *** జర్నలిస్టు తో జర్నలిస్టు 
శీర్షికన సీనియర్ జర్నలిస్టు ఆంధ్ర జ్యోతి ఎడిషన్ ఇన్ చార్జి శంకర్ రావు శెంకేసి కూన మహేందర్ తో ఇంటర్వ్యూ
ఫేస్ బుక్ వాల్ నుండి
సమకాలీన పరిణామాలను చరిత్రగా మలిచే పాత్రికేయులు.. తమ చరిత్రను మాత్రం అలిఖితంగానే మిగుల్చుకుంటారు. సీరియస్‌గా, కమిటెడ్‌గా పనిచేసే పాత్రికేయుల వృత్తిగత జీవితంలో ఎన్నో ఆసక్తికర అనుభవాలు, ఆలోచింప చేసే మలుపులు, మెరుపులూ మరకలూ, చీకట్లూ వెలుగులూ ఉంటాయి. వాస్తవానికి జర్నలిస్టుల వృత్తిగత, వ్యక్తిగత జీవితాలు వేర్వేరుగా ఉండవు. జర్నలిజమే సర్వమై, సమస్తమై వారి జీవితం కొనసాగుతూ ఉంటుంది. అట్లా ప్రవాహంలో కొట్టుకుపోయే నిఖార్సయిన జర్నలిస్టుల్లోని లోపలి మనిషిని వీలైనప్పుడల్లా పట్టుకోవడం, పలకరించడమే ఈ సంభాషణఉద్దేశం. ప్రస్తుతానికి ఈ మాటామంతీ పోరుగల్లు ఓరుగల్లు జర్నలిస్టులతోనే..!
********
"పాత్రికేయులు స్వేచ్ఛను కోల్పోయారు..
స్వరాష్ట్రంలో ఒరిగింది శూన్యం.."
అంటున్న సీనియర్ పాత్రికేయుడు 
కూన మహేందర్ తో "సంభాషణ"...
ప్రశ్న : ములుగు నుంచి మీ పాత్రికేయ ప్రస్థానం ఎలా మొదలైంది..?
జవాబు: 1986లో పత్రికారంగంతో నా అనుబంధం మొదలైంది. డిగ్రీ తర్వాత గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతుండగా... ఈనాడులో కంట్రిబ్యూటర్లు కావాలనే ప్రకటన చూసి అప్లై చేశాను. రాత పరీక్షలో సెలెక్ట్ అయ్యాను కాని జాయిన్ కాలేదు. 
ఈనాడు కన్నా ఉదయం అప్పట్లో అత్యధిక సర్కులేషన్ తో నడుస్తోంది. సెన్సేషనల్ వార్తలతో పత్రిక ప్రజల నోళ్లలో నానుతోంది. ఆ పత్రికలో పనిచేసేందుకు హైదరాబాద్ కార్యాలయానికి వెళ్ళాను. రాపోలు అనందభాస్కర్ కోఆర్డి నేటర్ గా ఉండేవారు. ముందు ములుగు నుండి విలేఖరిగా పనిచేసి అనుభవం తెచ్చుకుంటే సబ్ ఎడిటర్ గా కాని, రిపోర్టర్ గా తీసుకుంటామని చెప్పారు. ఓ వ్యాసం రాయమంటే అక్కడే రాసిచ్చాను. మూడు నెలల తర్వాత లెటర్ వచ్చింది. స్ట్రింగర్ గా అప్పాయింట్ మెంట్ ఇస్తూ అట్లాగే ఉచితంగా టెలిగ్రాఫిక్ బేరింగ్ కార్డు పంపించారు. అప్పుడు వరంగల్ లో స్టాఫ్ రిపోర్టర్ గా దాసరి కృష్ణా రెడ్డి ఉండేవారు. ఊగిసలాటల మధ్య 1987 చివరలో ఉదయంలో పూర్వ వరంగల్ జిల్లా ములుగు నుండి విలేఖరిగా నా ప్రస్థానం ప్రారంభించాను. మొదట తాత్కాలికమే అనుకున్న. కాని ఇదే వృత్తి పర్మనెంట్ అయిపోయింది.
ప్రశ్న: 1980లలో వార్తాసేకరణలో గ్రామీణ పాత్రికేయులకు అనేక ఇబ్బందులు ఉండేవని అంటారు కదా? అవి ఎలాంటివి?
జవాబు: ఆ రోజుల్లో పత్రికలంటే అందరికీ ఎంతో గౌరవం ఉండేది. అయితే రాజకీయ నాయకులు నెగెటివ్ వార్తలు వస్తే భరించే వారు కాదు. ఉదయం పత్రిక ఏ వార్త అయినా నిర్భయంగా ప్రచురించేది. దాంతో నాయకుల నుండి గొడవలు తప్పేవి కావు. ఉదయం పత్రిక అంటే వారికి నిద్ర పట్టేది కాదు. అనేక సెన్సేషనల్ వార్తలే కాక ప్రజల అసౌకర్యాలను వార్తల రూపంలో ఎత్తి చూపేది. ప్రజల పత్రికగా ఉదయం నడిచింది. అందులో పనిచేసిన పాశం యాదగిరి, మాడభూషి శ్రీధర్ వంటి జర్నలిస్టులను ఆదర్శంగా తీసుకుని పనిచేసాను.
ప్రశ్న: నక్సలిజం ఎక్కువగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో మీరు పనిచేశారు. వారి విషయంలో మీ అనుభవాలు?
జవాబు: దేశంలో ఎన్ని నక్సలైట్ గ్రూపులుండేవో అవన్నీ ములుగు అటవీ ప్రాంతంలో ఉండేవి. చండ్ర పుల్లారెడ్డి దాని చీలిక వర్గాలతో పాటు పీపుల్స్ వార్ నక్సలైట్ల కార్యకలాపాలు ఉధృతంగా ఉండేవి. చండ్ర పుల్లారెడ్డి చీలిక గ్రూపులు ప్రతి ఘటన, ప్రజా ప్రతిఘటన, జనశక్తి వర్గాల నక్సలైట్ల కార్యకలాపాలు అత్యధికంగా ఉండేవి. పీపుల్స్ వార్ నక్సలైట్లతో వార్తల విషయంలో ఏ గొడవ ఉండేది కాదు కాని, ఇతర గ్రూపులతో చాలా గొడవలు వచ్చేవి. ప్రెస్ నోట్ పంపితే తప్పని సరి వేయాలని హుకుం జారీ చేసే వారు. వార్త రాకుంటే ఎందుకు రాలేదని, మీరు పంపలేదా, మా వార్తలు రావటం లేదు అని అడిగే వారు. చీలిక వర్గాల మధ్య వర్గ పోరుతో ఒకరినొకరు చంపుకుని రక్తపాతం చేసుకున్నారు. ఒక గ్రూపు వార్త రాస్తే మరో గ్రూపు వారికి ఆగ్రహం కలిగేది. ఓ మిత్రున్ని న్యూస్ కవర్ చేయడం లేదనే కోపంతో ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పి పిలిపించి తీవ్రంగా కొట్టారు. గోవిందరావుపేట మండలంలో పనిచేసే ప్రతి విలేఖరిపై కూడా పోలీస్ ఇన్ ఫార్మర్ అనే ముద్ర వేశారు. ఉదయం దినపత్రికలో విలేఖరిగా పనిచేసిన శ్రీహరిని ఇదే గొడవల్లో చంపేశారు. శ్రీహరి విషయంలో నక్సలైట్లతో చర్చలు జరిపినా లాభం లేక పోయింది. యూనియన్ ప్రతినిధులుగా నాతో పాటు చర్చలకు వచ్చిన ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ ఎస్ . మోహన్ రావుకు నక్సలైట్ నేత అంతిరెడ్డి చేతిలో చేయి వేసి శ్రీహరిని క్షమిస్తున్నామని చంపబోమని చెప్పి కూడా, అ తర్వాత హన్మకొండలో కిడ్నాప్ చేసి గోవిందరావుపేటలో చంపేశారు. అంతిరెడ్డి బతికి ఉంటే  ఆయన ఇచ్చిన మాట ప్రకారం శ్రీహరికి ఏ హాని తలపెట్టే వారు కాదేమో. అంతిరెడ్డి ఎన్ కౌంటర్ లో చనిపోయిన తర్వాత ఆ పార్టి ప్రతీకారేఛ్ఛతో రగిలి పోయిన క్యాడర్ ఈ హత్యకు పాల్పడింది. శ్రీహరి అప్పటికే విలేఖరిగా పనిచేయడం మాని వేసి అటవి శాఖలో ఫారెస్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. 
వరంగల్ లో ఉంటే నక్సలైట్లతో ప్రాణ భయం ఉంటుందని గుంటూరుకు డిప్యుటేషన్ పై వెళ్లాడు. 
హన్మకొండలో భందువుల ఇంటికి వచ్చిన శ్రీహరిని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళి  చంపేసారు. 
ఇట్లా అనేక భయాల మధ్య పని చేశాం.

మరో వైపు పోలీసుల వైపు నుండి చాలా వత్తిళ్లు వచ్చేవి. ఎన్ కౌంటర్లు ఎక్కువగా అటవి ప్రాంతంలో 
జరిగేవి. ఆ ఎన్ కౌంటర్లు జరిగిన తీరుతో పాటు తదనంతర  ఫాలో అప్ కథనాలకు ఉదయం పత్రికలో
  ప్రాధాన్యత ఇచ్చే వారు. ఈ వార్తలు పోలీసులకు రుచించేవి కావు. ఉదయం పత్రికలో పనిచేసేవారంతా నక్సలైట్లని అందుకే నక్సలైట్ల వార్తలు ఎక్కువగా ఇస్తారని పోలీసులు ఆరోపించే వారు. ఆరోజుల్లో నక్సలైట్ల వార్తలు ఉదయం పత్రికలో తప్ప ఇతర పత్రికల్లో ఎక్కువగాగా వచ్చేవి కావు. హక్కుల సంఘాలు 
నిజనిర్దారణ చేసేకన్నా ముందే ఉదయం పత్రిక ఎన్ కౌంటర్ సంఘటనను తేల్చేసేది. ఈ క్రమంలో
 పోలీసుల చేత అనేక సార్లు గొడవలు వచ్చాయి. పోలీసులు ఓ సారి నా పై తప్పుడు కేసు కూడ పెట్టారు.

 డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిపై తిరగ బడ్డాడంటూ కేసు పెడితే ఆ కేసు కోర్టులో నిలవ లేదు.
ప్రశ్న: వరంగల్‌తో పాటు, మహబూబ్‌నగర్‌ వంటి జిల్లాల్లో కూడా మీరు స్టాఫర్‌గా పనిచేశారు. అక్కడి మీ అనుభవాలు?
జవాబు: మహబూబ్ నగర్ లో పనిచేసిన రోజులు మరిచి పోలేనివి. పాలమూరు వలస కార్మికుల వార్తలు అనేకం రాసాను. ఎప్పుడు సమయం దొరికినా ఏదో ఒక ప్రాంతం వెళ్ళి పాలమూరు కూలీలతో ముచ్చటించి వారి కష్టాలు అర్దం చేసుకునే ప్రయత్నాలు చేసేవాన్ని. పాలమూరు కూలీల గురించి చాలా పని చేయాలనుకున్నా కాని అనుకున్నంతగా చేయలేక పోయా. పాలమూరు కరవు జిల్లా గురించి స్థానిక ప్రజా సంఘాల సహకారంతో ఛాయా చిత్రాలు, వ్యంగ చిత్రాలతో రెండు రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించాం. ఇందులో జర్నలిస్టుల మంతా కలిసి పనిచేశాం.
ప్రశ్న: పాత్రికేయుల పరిస్థితి ఇప్పుడెలా ఉంది?
జవాబు: స్వేచ్ఛ హరింపబడింది. ఈ స్వేచ్ఛను పాత్రికేయుడి నుండి యాజమాన్యాలు లాగేసుకున్నాయి. ప్రజా పాత్రికేయ వ్యవస్థ రూపం మారిపోయింది. యాజమాన్యాలు పాత్రికేయులను పూర్తిగా మార్కెటింగ్ సరుకుగా మార్చేశాయి. ఏ వార్త రాయాలనే స్వేచ్ఛ పాత్రికేయుడికి లేకుండా పోయింది. ఒకప్పుడు వార్తను విలేఖరే స్వయంగా నిర్ణయించే వాడు. కాని నేడు వార్తలేమిటో మేము నిర్ణయిస్తాం.. మీరు పనిచేయాలని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఒకప్పుడు పాఠకులను హత్తుకునేలా అచ్చు వేసే పని మాత్రమే చేసిన యాజమాన్యాలు నేడు తప్పుడు పనులన్నింటిలో పాత్రికేయులను ఇరికిస్తున్నాయి.
ప్రశ్న: తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ సమయంలో మీరు టీజేఎఫ్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కన్వీనర్‌ సుదీర్ఘకాలం పనిచేశారు. ఉద్యమం నాటి జ్ఞాపకాలు చెప్పండి?
జవాబు: తెలంగాణ కోసం వృత్తి పరిమితులు కూడా పక్కన పెట్టి పనిచేసాను. అందుకు యాజమాన్యం నుండి శ్రీముఖాలు అందుకున్నా. తెలంగాణ ఉద్యమాన్ని పని లేని పవర్ మాంగర్స్ చేస్తున్నారని, వార్తలు రాయవద్దని, రాస్తే గీస్తే సింగిల్ కాలం కన్నా ఎక్కువ రాయవద్దని ఇంటర్నల్ గా సర్క్యులర్ ఇచ్చారు. కాని ఆ తర్వాత రోజుల్లో ఉద్యమం బలపడుతున్న కొద్దీ తెలంగాణ పట్ల ప్రజలకున్న ఆకాంక్షను అర్థం చేసుకున్న ఎడిటర్లు... నా చేత కాళోజి నారాయణ రావు, జయశంకర్ సర్ ఇంటర్వ్యూలు చేయించారు. 
టిజెఎఫ్ కన్నా ముందు రాపోలు ఆనంద భాస్కర్ ప్రారంభించిన తెలంగాణ ప్రగతి వేదిక, ఆ తర్వాత తెలంగాణ మహాసభ, ఐక్య వేదిక ద్వారా జర్నలిస్టులతో కలిసి తెలంగాణ వార్తలు ఫోకస్ చేస్తూ పనిచేసాను. 
టిజెఎఫ్ లో వరంగల్ జిల్లాకు సుదీర్ఘ కాలం కన్వీనర్ గా ఉన్నప్పటికీ, కొన్ని అన్ ఫేర్ పాలిటిక్స్ నాకు నచ్చక రొబోటిక్ లా పనిచేసాను. కాని కొందరు జర్నలిస్టు మిత్రులు ఇచ్చిన సహకారం నేనెప్పుడూ మరవ లేను. నాతో పాటు పోస్టర్లు అంటించిన వారు బ్యానర్లు కట్టిన వారు చాలా మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల అనుభవాలు డాక్యుమెంటేషన్ చేసే పనికి ఉపక్రమించి మిత్రుడు శంకర్ రావు శెంకేసి సంపాదకత్వంలో సీనియర్ జర్నలిస్టుల వ్యాసాలతో తెలంగాణ అక్షరాళ్ళు అనే పుస్తకం తీసుకురావడం నాకు ఎంతో సంతృప్తి కలిగించింది. 
అయితే ఈ పుస్తకం ఆవిష్కరణకు ముందు, కొందరు జర్నలిస్టు మిత్రులు మానుకోట సంఘటన రాళ్ళ దాడుల ఫోటోలు తీసివేయమని అడ్డంకులు కల్పించారు. అసలు పుస్తకం ఆవిష్కరణ జరగనీయకుండా చూడాలనుకున్నారు. చివరికి ఏదో ఆవిష్కరణ జరిగిందనిపించాం. ఈ పుస్తకాన్ని బ్లాగులో పెట్టాం. అచ్చు వేయించింది రెండు వేలే అయినా 28 వేలకు పైగా బ్లాగులో చదివారు.
ప్రశ్న: మీ మూడు దశాబ్దాల జర్నలిజం అనుభవంలో మీకు సంతృప్తినిచ్చిన మీ కథనాలు ఏవైనా ఉన్నాయా?
జవాబు: మహబూబ్ నగర్ లో కాకర్ జాల్ అనే గ్రామంలో ఒక పెత్తందారు మాదిగలను గ్రామ బహిష్కారం చేయించిన వార్త అప్పట్లో ఆంధ్ర ప్రభలో పతాక శీర్షికలో వచ్చింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కూడా బ్యానర్ వార్త అది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కాకర్ జాల్ గ్రామానికి కదిలి వచ్చింది. చెట్టు కొకరు పుట్టకొకరు అయి 10 సంవత్సరాల నుండి బయట తల దాచుకుంటున్న మాదిగలను మేళతాళాలతో గ్రామానికి తీసుకువచ్చి అన్ని కులాల వారితో సహపంక్తి భోజనాలు పెట్టించారు. వారికి ఇండ్లు, రుణాలు మంజూరు చేసారు.
కలేకూరి ప్రసాద్ నా వార్త చదివి ఒక సారి మల్లేపల్లి లక్ష్మయ్య ద్వారా సికింద్రాబాద్ లో ఆయన ఆఫీసుకు పిలిపించుకుని అభినందించారు.
ప్రశ్న: ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చానా.. అనే రిగ్రెట్‌ ఉందా?
జవాబు: ఈ వృత్తి జీవనాధారం కాదని తెలుసు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వృత్తి నుండి తప్పు కోవాలనే భావన ఏనాడూ కలుగ లేదు. ఆంధ్రప్రభ తర్వాత ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చే జీతం ఎక్కువో తక్కువో అయినా జీవనం గడిచింది.
ప్రశ్న : జర్నలిస్టు యూనియన్ల పాత్ర ఇప్పుడెలా ఉంది?
జవాబు: యూనియన్లకు రాజకీయాలు బాగా అబ్బాయి. ఇవి చీలిపోవడం వల్ల ఇంకా బలహీన పడ్డాయి. వేజ్ బోర్డు సమస్యలు, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పట్టించుకునే స్థితిలోలేవు. జర్నలిస్టుల, స్వేచ్ఛ, హక్కుల గురించి పోరాడే యూనియన్లు లేవు.
ప్రశ్న: జర్నలిజాన్ని కెరీర్‌గా ఎంచుకునేందుకు ఇప్పటి తరం వాళ్లు వెనుకాడుతున్నారు. మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు: జర్నలిజం అనేది వృత్తి అయినా ఇందులో సామాజిక సేవా దృక్పథం ఇమిడి ఉంది. ఉన్నత ఆదర్శమైన విలువలు ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థల్లో నాలుగో స్తంభం అయిన ఈ వ్యవస్థను పూర్తిగా పొట్ట కూటి వృత్తితో ముడి పెట్టవద్దు. ఇష్టంగా ఈ వృత్తిలోకి వచ్చే వారు ఎన్ని కష్టాలైనా భరించి విలువలకోసం పాకులాడుతారు. పొట్టకూటి కోసం ఆలోచించే వారు... బయట రంగాలలోని ఆకర్షణీయమైన ప్యాకేజీలు చూసి ఈ వృత్తిలోకి రావడం లేదు.
ప్రశ్న: తెలంగాణ స్వయం పాలనలో జర్నలిస్టుల ఆకాంక్షలు నెరవేరడం లేదనే విమర్శ ఉంది. నిజమేనా? 
జవాబు: చాలా మంది తెలంగాణ జర్నలిస్టుల లెక్కనే నేను కూడా తెలంగాణ వస్తే ఏదో జరుగుతుందని ఆశించాను. కాని ఏం జరిగింది లేదు. ఎవరూ ఒరగ బెట్టింది లేదు. కనీసం గతంలో ఆంధ్ర పాలకులు మంజూరు చేసిన ఇండ్లస్థలాలు వస్తే చాలనుకున్నాం. ఇండ్ల స్థలాల కోసం ఆంధ్ర పాలకులను నిలదీసిన రోజులు ఉన్నాయి. కానీ తెలంగాణ స్వరాష్ర్టంలో జర్నలిస్టులకు కనీసం ప్రశ్నించే స్వేచ్ఛ కూడా లేదు.
ప్రశ్న: మీ కుటుంబం గురించి చెప్పండి...?
జవాబు: తల్లి దండ్రులు కాలం చాలించారు. ఎదిగిన పిల్లలు పాప, బాబు చేతి కొచ్చారు. కొన్ని అసంతృప్తులు ఉన్నాయి కాని ఆకలి రాజ్యం అయితే లేదు. ప్రస్తుతం హన్మకొండలో ఉంటున్నా.
++++++##+++++
(మహేందర్ సెల్ నెం. 9440146633)
* ఇంటర్వ్యూ: శంకర్ శెంకేసి (79898 76088)


FACE BOOK WALL: 

Post a Comment

0 Comments